ఏపీ రాజధాని అమరావతి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన.. హలీవుడ్ ఫిలిం మేకర్లు కూడా సృష్టించలేని గ్రాఫిక్స్ చంద్రబాబు సృష్టించారని సెటైర్లు వేశారు. మంచి ఫిల్ మేకర్ కావాల్సిన చంద్రబాబు.. రాజకీయాలు చేస్తున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు.

కేంద్రీకరణ ద్వారా అభివృద్ధి జరుగుతుందనే విధానం సరి కాదని... కేంద్రీకరణతో అభివృద్ధి జరగదనే అంశంపై బహిరంగ చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. అమరావతిని నోటిఫై చేయలేదంటూ ఇప్పుడు చంద్రబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని... నాలుగున్నరేళ్ల కాలంలో రాజధానిని నోటిఫై చేయాలని ఆయనకు గుర్తుకు రాలేదా..? అని మంత్రి ప్రశ్నించారు.

Also read:ఏం జరిగిందో చెప్పడానికి వస్తే దాడికి దిగుతారా: వైసీపీపై బాబు ఫైర్

రాజధానిలో గత ప్రభుత్వ అవినీతిని త్వరలోనే బయటపెడతామని... పక్కాగా విచారణ చేస్తున్నామని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రాజధాని కోసం రూ. 5వేల కోట్లు అప్పుల ద్వారా తెచ్చారని.. రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టి.. రూ. 50 వేల కోట్లకు టెండర్లు పిలుస్తారా..? అని ఆయన నిలదీశారు.

కొత్త రాజధానులకు కేంద్రం ఎంత నిధులు ఇస్తుందని ఎప్పుడైనా ఆలోచన చేశారా..? అని బుగ్గన ప్రశ్నించారు. రాజధానిలో భూములు అమ్ముతూ వెళ్తామని 2030 వరకు అంచనాలు వేశారన్నారు. రోడ్ల కోసం కిలో మీటరుకు రూ. 46 కోట్ల ఖర్చుతో చంద్రబాబు అంచనా వేశారని... ఆ విధంగా ఆయన స్వర్గానికి రోడ్ వేద్దామనుకున్నారా అంటూ ధ్వజమెత్తారు.

బెంగళూరుతో సమానంగా ఎదిగే అవకాశం ఉన్న హైదరాబాదును దెబ్బతీసింది చంద్రబాబేనని మంత్రి దుయ్యబట్టారు. బెంగళూరులో స్థలాలను ఐటీ కంపెనీలకు అమ్మితే.. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ద్వారా ఐటీ కంపెనీలకు అమ్మారని మంత్రి ఆరోపించారు.

హైదరాబాదులో ఐటీ సెక్టార్ తెచ్చానన్న చంద్రబాబు.. విశాఖను ఎందుకు ఐటీ హబ్ చేయలేకపోయారని మంత్రి నిలదీశారు. ఐఏఎస్, మంత్రులు క్వార్టర్ల డిజైన్లు ఏ మాత్రం బాలేదన్నారు... బట్టలు మార్చుకుంటే కన్పించేలా డిజైన్ చేశారని రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

Also Read:కీలక నేత ఆవేదన: టీడీపీలో చేరి నష్టపోయాం, జగన్ కు ఆ ఫ్యామిలీ రిక్వస్ట్

మేధా పాట్కర్, రాజేంద్ర సింగ్ వంటి వారు రాజధానిలో పర్యటిస్తే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారని బుగ్గన ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజధాని గడ్డను ముద్దు పెట్టుకునేంత ప్రేమ ఉంటే ఇల్లేందుకు కట్టుకోలేదన్నారు. జగన్ సొంతింట్లో ఉంటుంటే... టీడీపీ అధినేత అక్రమ నిర్మాణంలో ఉంటున్నారని బుగ్గన ఫైరయ్యారు.