తనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆర్ధిక మంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా అని ఆయన సెటైర్లు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అప్పుల మంత్రినా అని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా అని బుగ్గన నిలదీశారు. దేశంలో ఒక్క ఏపీ మాత్రమే అప్పులు చేస్తోందా... ఆర్ధిక మంత్రిగా తాను అప్పులు చేస్తానని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. పాల వ్యాపారం చేసుకుంటుకున్న చంద్రబాబును పాల నాయుడు అనలా అంటూ మంత్రి సెటైర్లు వేశారు. చంద్రబాబు రౌడీషీటర్ మాదిరి మాట్లాడుతున్నారని.. ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు చెబుతున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా అంటే ఎవర్ని బెదిరిస్తారు.. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రజల్లో ఏమి మాట్లాడినా నడుస్తుందనే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని... ఈ ప్రభుత్వం విద్యా, వైద్యంపై శ్రద్ధ చూపుతోందని బుగ్గన స్పష్టం చేశారు. అసలు చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. కోవిడ్ ఉన్నప్పటికీ రూ.13,200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2014లో ఇంటికి ఒక ఉద్యోగమని బాబు చెప్పారని... కర్నూల్‌లో ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చంద్రబాబు ఆలోచించుకోవాలని బుగ్గన పేర్కొన్నారు. సోలార్ విండ్ పవర్‌లో పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వంలో జరుగుతోందని... ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ ఈ ప్రభుత్వంలోనే ఏర్పాటైందన్నారు.
ALso Read:చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ఎన్నిక!
అసలు రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు విజ్ఞులు కాబట్టి బాబు పర్యటనను అడ్డుకోలేదని బుగ్గన చురకలంటించారు. రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాబట్టి హైకోర్ట్ ఉండాలంటే వద్దంటారని దుయ్యబట్టారు. మూడు రాజధానులకు ఎందుకు వ్యతిరేకమని బుగ్గన ప్రశ్నించారు. రాయలసీమ ఏమి పాపం చేసింది .. కోర్ట్‌ను కూడా అడ్డుకుంటున్నారని మంత్రి నిలదీశారు.
