అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏపీలో ధన యజ్ఞం జరుగుతున్న రోజుల్లో వైయస్ జగన్ సెటిల్ మెంట్లతో బిజీబిజీగా గడిపారంటూ ఆరోపించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా చంద్రబాబుపై యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగినదానిని వక్రీకరించి చెప్తూ నాకు అబద్దాలు చెప్పడం అలవాటే అని చంద్రబాబు ఒప్పుకున్నట్టు చెప్పారని మండిపడ్డారు.

చంద్రబాబు మీద జోకు వేయబోయి, మీ తండ్రి హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో జరిగిన రూ.400 కోట్ల అవినీతిని మరొక్కసారి ప్రజలకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు నారా లోకేష్. 

అనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను చదువుకుని వస్తే బాగుండేదంటూ జగన్ కు సెటైర్లు వేశారు. ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో చూడాలంటూ ఆనాటి పేపర్ ను పోస్ట్ చేశారు. 

తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం మీ తండ్రి ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిందని తెలిపారు. ఆనాటి తెలుగుదేశం పార్టీ  వ్యూహంలో ఇరుక్కుని గిజగిజలాడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశం మరుసటి రోజున అనేక పత్రికల్లో మీ నాయన అవినీతి ధనయజ్ఞం గురించి పత్రికలు ఎంత గొప్పగారాశాయో చదివితరించండి అంటూ ఆనాటి పేపర్ ను పోస్ట్ చేశారు. 

మీ తండ్రి వైయస్ పాలనలో ఏపీలో ధనయజ్ఞం జరుగుతున్న రోజుల్లో మీరు సెటిల్ మెంట్లతో బిజీగా ఉన్నారని జగన్ పై విరుచుకుపడ్డారు. సెటిల్మెంట్లలో బిజీ కాబట్టి రాష్ట్రంలోనూ, అసెంబ్లీలోనూ ఏం జరుగుతుందో అది ఇచ్చంపల్లో, ఎల్లంపల్లో తెలుసుకునే అవకాశం లేకుండా పోయి ఉంటుందని విమర్శించారు. ఎవరో చెప్పిన గాలి మాటల్ని పట్టుకుని ఆకాశం మీద ఉమ్మే ప్రయత్నం చేయకండి అంటూ వైయస్ జగన్ కు సలహా ఇచ్చారు నారా లోకేష్.