అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు మాజీమంత్రి నారా లోకేష్. వైయస్ జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

కర్నూలు జిల్లాలో కోవెలకుంట్లకు చెందిన రైతుల ధాన్యాన్ని వేలం వేస్తామని బ్యాంకులు వేలం వేస్తామని ప్రకటించిన ప్రకటనపై స్పందిస్తూ జగన్ కు సెటైర్లు వేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అంటే రైతుల పంటని బ్యాంకులు వేలం వేయడం అని ఆలస్యంగా అర్థమైందంటూ విమర్శించారు.

వైయస్ జగన్ రెట్టింపు చేసింది రైతుల ఆదాయం కాదని ఆవేదనను రెట్టింపు చేశారంటూ విరుచుకుపడ్డారు. పంటని తక్కువ ధరకు అమ్మాల్సి వస్తే ప్రభుత్వమే కొంటుందని జగన్ స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

తీసుకున్న అప్పు తీర్చలేదని గోదాంలో ఉన్న శనగ నిల్వలని బ్యాంకులు వేలం వేస్తుంటే.. మీరు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇదేనా మీరు ఆదాయం రెట్టింపు చేస్తామన్న విధానం అంటూ విమర్శించారు. 

మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపైనా సెటైర్లు వేశారు నారా లోకేష్. కర్నూలులో బ్యాంకుల వేలం అంశాన్ని బుగ్గనకు చేరవేయండంటూ చెప్పుకొచ్చారు. లేట్ ఎందుకూ ఒక ఫోన్ కొట్టండి. బుగ్గనగారు గాలి పోగేసి వేలానికి చంద్రబాబుగారే కారణం అంటూ ఒక లేఖ తయారు చేస్తారంటూ ఘాటుగా సెటైర్లు వేశారు.

వివరాల్లోకి వెళ్తే కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతులు వేరుశనగతో పాటు ఇతర పంటల సాగు కోసం ఎస్బీఐ బ్యాంకులో రుణం తీసుకున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట నష్టం వచ్చింది. ఫలితంగా రైతులు బ్యాంకుకు అప్పులు చెల్లించలేక పోయారు.  

దాంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. మరికొందరు రైతులు తమకు మద్దతు ధర లభించినప్పుడు అమ్ముకుందామని ధాన్యాన్ని గోడౌన్లలో నిల్వ ఉంచారు. ఆ నిల్వ ఉంచిన ధాన్యాన్ని విక్రయిస్తామంటూ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు పత్రికలలో వేలం నోటీసులకు సంబంధించి యాడ్స్ కూడా ఇచ్చారు. ఎస్బీఐ నోటీసులు, వేలం ప్రకటనలను చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.