విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవర్నతాల్లో మూడు రత్నాలు ప్రమాణస్వీకారానికి ముందే రాలిపోయాయని ఆరోపించారు. 

పింఛన్లు రూ.3వేలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు తర్వాత ఎప్పుడో చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు పోలవరం తమ బాధ్యత కాదని కేంద్రం చూసుకుంటుందని జగన్ ప్రకటించడం చూస్తుంటే మరోహామీకి నీళ్లొదిలేసినట్లేనని మండిపడ్డారు. 

ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటా తప్ప ఏమీ చేయలేమంటూ జగన్ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే నవరత్నాల్లో మూడు హామీలకు తిలోదకాలిచ్చిన జగన్ ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకెన్ని హామీలను తుంగలో తొక్కుతారోనని అయ్యన్నపాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు.