గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు మాజీమంత్రి ఆలపాటి రాజా. వైయస్ జగన్ అసమర్థపు సీఎం అంటూ ధ్వజమెత్తారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థపు పాలనను ఎన్నడూ చూడలేదని విమర్శించారు. 

సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చేశారని ఆరోపించారు. లోటుబడ్జెట్ లో ఉన్నప్పుడే తాము 24 గంటలు కరెంట్ ఇస్తే ఇప్పుడు సీఎం జగన్ కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఏపీ చీకటి రాజ్యంగా మారిందని విమర్శించారు. 

ఇటీవల కురిసిన వర్షాలతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాలు పూర్తిగా నిండాయని చెప్పుకొచ్చారు. జలాశయాలు నిండినా విద్యుత్ కోతలు విధించడంపై ఆయన మండిపడ్డారు. విద్యుత్ కోతలు విధించడం సిగ్గుమాలిన చర్చ అంటూ తిట్టిపోశారు. 
 
తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే జగన్ దోపిడీకి బాటలు వేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీ సంపదను తెలంగాణకు కట్టబెట్టడం కోసమే కేసీఆర్ తో దోస్తి చేపట్టారని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ పేరుతో  ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. రివర్స్ టెండరింగ్ అంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి ఆలపాటి రాజా. ఆలపాటి రాజా వ్యాఖ్యలపై సీఎం జగన్ లేదా వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.