Asianet News TeluguAsianet News Telugu

దర్శనానికి వచ్చి రాజకీయాలా... దుర్గగుడికి చంద్రబాబు చేసిందేమీ లేదు : మంత్రి కొట్టు సత్యనారాయణ

టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. 

ap endowments minister kottu satyanarayana slams tdp chief chandrababu naidu
Author
First Published Oct 5, 2022, 9:41 PM IST

దసరా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తవుతున్నాయన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని ప్రశంసించారు. జిల్లా కలెక్టరు, పోలీస్ కమీషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మంత్రి చురకలంటించారు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపీకి జరగకూడదని సీఎం అడుగులు వేస్తున్నారని మంత్రి చెప్పారు. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని ఎందుకు వదిలి వచ్చామో చెప్తే బాగుండేదంటూ కొట్టు సత్యనారాయణ సెటైర్లు వేశారు. 

రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. రియల్ ఎస్టేట్ రాజధాని అమరావతి ఎందుకని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. 2014లో తాను మారిపోయా అని చెప్పారని.. అధికారంలోకి రాగానే చంద్రబాబు మాట మార్చారంటూ కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదని.. రూ. 150 కోట్లు దుర్గ గుడికి ఇచ్చానని అబద్ధాలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. క్యు కాంప్లెక్స్ ఒకటి కట్టి రూ. 150 కోట్లతో అభివృద్ధి చేశా అని చెప్పడం ఏంటి అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. 

ALso REad:బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. కేసీఆర్ జాతీయ పార్టీపై ఏమన్నారంటే..?

సీఎం జగన్ ఎక్కడ మాట తప్పారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్ ఎక్కడ చెప్పారని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని అమరావతి కాబట్టి ఇల్లు ఇక్కడ కట్టుకున్నారని ఆయన చురకలు వేశారు. అమరావతి వద్దు హైదరాబాద్ ముద్దు అంటున్నది చంద్రబాబని కొట్టు సత్యనారాయణ సెటైర్లు వేశారు. మీరు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఎర్పాటు చేయమంటే సాధ్యం కాదని.. మీరు డిక్లేర్ చేసిన రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. 

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓట్లు మీకు అవసరం లేదా అని మంత్రి ప్రశ్నించారు. రాజధానిలో ఇళ్ళ స్థలాల  కోసం కేటాయిస్తే పేదలకు ఇళ్ల స్థలాలు వద్దని కోర్టులో కేసులు వేసింది నిజం కాదా అని కొట్టు సత్యనారాయణ నిలదీశారు. చంద్రబాబుకు మూడు రాజధానులు ఏర్పాటు అయ్యేలా ఆలోచన జ్ఞానం పెరిగేలా చేయాలని దుర్గమ్మను వేడుకుంటున్నానన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios