Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రిపై ఐదు స్లాట్స్‌లో దుర్గమ్మ దర్శనాలు.. వీఐపీ లెటర్స్‌పైనా ఆంక్షలు : కొట్టు సత్యనారాయణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొదలగు ప్రముఖుల లెటర్ రోజుకు ఒక్కటి మాత్రమే అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 5 టైమ్ స్లాట్ ల ప్రకారం దర్శనాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

ap endowments minister kottu satyanarayana comments on dussehra navratri arrangements in vijayawada durga temple
Author
First Published Aug 30, 2022, 9:16 PM IST

ఈ ఏడాది దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి భక్తుడికీ మంచి దర్శనం కల్పించాలనేదే మా ఉద్ధేశ్యమన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నప్పటికీ ఏటా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై అంబులెన్స్, ఫైర్ సర్వీసులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు కొట్టు సత్యనారాయణ తెలిపారు. మిగిలిన స్థలమంతా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. టోల్ గేట్ ఒక ఎంట్రన్స్ భక్తులకు, మరో ఎంట్రన్స్ అంబులెన్స్, ఫైర్ సర్వీస్ లకు ఉపయోగిస్తామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. 

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొదలగు ప్రముఖుల లెటర్ రోజుకు ఒక్కటి మాత్రమే అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వారి సిఫార్స్ లేఖలపై ఆరుగురికి వీఐపీ దర్శనం టికెట్స్ కోరిన స్లాట్స్ లో ఇస్తామని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొదలగు ప్రముఖులు స్వయంగా దర్శనానికి వచ్చినచో వారితోపాటు ఐదుగురికి  ఉచిత వీఐపీ దర్శనం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 5 టైమ్ స్లాట్ ల ప్రకారం దర్శనాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

ఒకసారి స్లాట్ దర్శనం జరగకపోతే మరోసారి దర్శనం చేసుకోవడమనేది జరగదని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మళ్లీ టిక్కెట్ కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు లెటర్ పైన 1+5 ఉచిత టిక్కెట్ దర్శనం చేయిస్తామని, ఒక ఎమ్మెల్యేకి రోజుకి ఒక లెటర్ మాత్రమే కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు, ఇంఛార్జికి వెసులుబాటును బట్టి టిక్కెట్స్ ఇస్తామని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వీఐపీ దర్శనాలకు వచ్చే వారి కోసం మోడల్ గెస్ట్ హౌస్ వద్ద వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

అయితే ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమేనని, ఈ ప్రతిపాదనలు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రసాదం కౌంటర్లన్నీ ఎగ్జిట్ వద్దే ఏర్పాటు చేస్తామని.. ప్రసాదంలో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మంచి నాణ్యతతో 100 గ్రాముల లడ్డూ తయారీ చేయాలని సూచించామన్న మంత్రి.. భక్తులకు  పులిహోర, చక్కెరపొంగలి, దద్దోజనం బఫే తరహాలో అందజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులు, భవానీ భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కొట్టు సత్యనారాయణ తెలిపారు. 

Also REad:ఇకపై దేవాదాయ శాఖలో ప్రతి ఉద్యోగికి డ్రెస్‌కోడ్ : మంత్రి కొట్టు సత్యనారాయణ

ఇకపోతే .. వినాయకచవితి ఉత్సవాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుడు ఎంతో శాంతమూర్తి అని, ఆయనతో ఆడుకుంటే అంతే కోపోదృక్తుడవుతాడని ఫైరయ్యారు. బీజేపీ నాయకులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మేం దేవుడితో ఆడుకుంటాం ఏం చేస్తారని సవాల్ విసురుతున్నారని.. బీజేపీ చేసే విమర్శలకు టీడీపీ నేతలు వంతపాడటం సిగ్గుచేటన్నారు. వినాయక చవితి పందిళ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని దేవాదాయ మంత్రి పేర్కొన్నారు. 

కేవలం ఫైర్, పోలీస్ పర్మిషన్లకు నామమాత్రం రుసుములే వసూలు చేస్తున్నామని.. దయచేసి భగవంతుడితో ఆడుకోవద్దని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. దేవుడితో రాజకీయం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తున్నామని.. విజయవాడలో వీధివీధినా పందిళ్లు ఏర్పాటు చేశారని మంత్రి గుర్తుచేశారు. తాము నిజంగానే వారిని ఇబ్బంది పెడితే ప్రజలెవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఇంతవరకూ ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేశారా అని ఆయన నిలదీశారు. భగవంతుడి కార్యక్రమాన్ని స్నేహపూరిత వాతావరణంలో జరుపుకోవాలని.. గతంలో 44 ఆలయాలు పడేస్తే బీజేపీ నేతలు కిక్కురుమనలేదని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వినాయకచవితి ఉత్సవాలపై మీరు చెప్పే మాటలు మోదీకి చెప్పాలని.. ఆయన సమర్ధిస్తారేమో మాట్లాడి చెప్పాలంటూ మంత్రి చురకలు వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios