పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలి:సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు
సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు మంగళవారం నాడు చర్చించారు.
హైదరాబాద్: సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మంగళవారం నాడు భేటీ అయ్యారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే జీపీఎస్ విధానంపైనే ప్రభుత్వం చర్చించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
పెన్షన్ విధానంపై చర్చలకు రావాలని ఏపీసీపీఎస్ఈఏ, ఏపీసీపీఎస్‌యూఎస్ సంఘాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలకు ఆహ్వానించారు. సీపీఎస్ రద్దు ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వం చర్చించింది. పాత పెన్షన్ విధానం అమలు చేస్తేనే చర్చలు కొనసాగిస్తామని తాము చెప్పామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.రాజస్థాన్,జార్ఖండ్ మాదిరిగా రాష్ట్రంలో ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అంతేకాదు ఉద్యోగ సంఘాలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానంపై చర్చలు జరుపుతామంటేనే వస్తామని ప్రభుత్వానికి తమ వైఖరిని స్పష్టం చేశామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
సీపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీపీఎస్ ను రద్దు చేయాలనే డిమాండ్ తో ఈ నెల 11 సీఎం ఇల్లు ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. తొలుత ఈ కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీన నిర్వహించాలని తలపెట్టాయి. అయితే ఉద్యోగులపై కేసులు, నిర్భంధం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కూడా ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.