తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్ స్టేషన్‌లో యువకుడికి శిరోముండనం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన పూర్తి విచారణకు ఆదేశించారు.

ఇలాంటి వ్యవహరశైలిని ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ స్పష్టం చేశారు. కాగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేసి సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టారు.

అక్కడితో ఆగకుండా యువకుడికి శిరోముండనం చేశారు. తీవ్రగాయాల పాలైన అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు ఇన్‌ఛార్జి ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై దాడి చేశాడని బాధిత యువకుడు ఆరోపిస్తున్నాడు. ఆ సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. వెదుళ్లపల్లిలోని బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ ఆందోళన చేపట్టాయి.