Asianet News TeluguAsianet News Telugu

ఏపీ పోలీస్ వార్షిక నివేదిక.. కరోనాతో ఎంతోమంది సిబ్బందిని కోల్పోయాం: ఏపీ డీజీపీ

2020 లో పోలీసులు ఎదుర్కొన్న ఛాలెంజ్ లు చాలా ఉన్నాయన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. బుధవారం సంవత్సర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కోవిడ్ - 19 నేపథ్యంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్నారు

ap dgp gowtham sawang released ap police annual report ksp
Author
Amaravathi, First Published Dec 23, 2020, 3:04 PM IST

2020 లో పోలీసులు ఎదుర్కొన్న ఛాలెంజ్ లు చాలా ఉన్నాయన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. బుధవారం సంవత్సర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కోవిడ్ - 19 నేపథ్యంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్నారు.

ఏపి ప్రభుత్వం కోవిడ్ కాలంలో చాలా త్వరితంగా స్పందించిందని, అన్ని శాఖలు చాలా బాగా పనిచేశాయని డీజీపీ ప్రశంసించారు. పోలీసులు కోవిడ్ ఫ్రంట్ లైన్‌లో ఉండి ఎదుర్కొన్నారని... రోడ్లపై ఉంటూ నేరుగా కోవిడ్ కు ఎదురు నిలబడ్డారని సవాంగ్ గుర్తుచేశారు.

ఈ క్రమంలో 14వేల మంది ఏపీ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారని.. 109 మంది పోలీసులను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.

పోలీసు డిపార్ట్మెంట్ లో ఒక మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిందని.. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రధాన లక్ష్యమని డీజీపీ చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండేలా పోలీసింగ్ తీసుకొచ్చామని గౌతం సవాంగ్ వెల్లడించారు.

పోలీసులలో పారదర్శకత, బాధ్యత, అత్యంత భద్రత వచ్చేలా కృషి చేసామని.. పోలీసులు, ఏపీ ప్రభుత్వం కమిట్మెంట్  కారణంగా మాకు ఎన్నో అవార్డులు వచ్చాయని ఆయన తెలిపారు. న్యాయానికి అందరు సమానమేనని.. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకతతో పని చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

ఇసుక, మద్యం పాలసీల నేపధ్యంలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేశామని.. గత ఏడు నెలల్లో గుర్తించ దగిన 69,688 కేసులు మద్యం అక్రమ రవాణాలో ఎస్ఈబీ ద్వారా నమోదయ్యాయని గౌతం సవాంగ్ వెల్లడించారు.

మొత్తం 1.94 లక్షల కేసులు ఎస్ఈబీ లో నమోదు చేశారని.. 102 ప్రభుత్వ అధికారులు ఈ కేసుల్లో ఉంటే, వారిలో 72 మంది పోలీసులు వున్నారని చెప్పారు. ఈ ఏడాది మహిళా భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చాలా చేపట్టామని.. దిశ చట్టానికి అనుబంధంగా మరిన్ని చేశామన్నారు.

దిశ పోలీసు స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంచామని.. త్వరితగతిన ఒక కేసు నమోదు చేసి, పూర్తి చర్యలు జరిగేలా దిశ పోలీసు స్టేషన్లలో ఏర్పాట్లు చేశామని డీజీపీ చెప్పారు. దిశ పోలీసులకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మొబైల్స్ కూడా ఇచ్చామని గౌతం సవాంగ్ గుర్తుచేశారు.

కేసుల విచారణలో ఫోరెన్సింగ్ చాలా ముఖ్యమైనదని.. దిశకు అనుబంధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి లలో ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేసామన్నారు. దిశ అనేది ఒక కోర్సు లాగా కూడా ఇస్తున్నామని.. దిశ యాక్టు వస్తే ఈ విధానం మొత్తం అత్యంత బలోపేతం అవుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు.

దిశ యాప్ ఉన్న ఫోన్ లు మూడు సార్లు షేక్ చేస్తే సమాచారం పోలీసులకు వెళుతుందని.. క్రిమినల్ జస్టిస్ సిస్టం అనేదానికి ఒక టైమ్ లైన్ ఉండేలా దిశ అనేది పని చేస్తుందని ఆయన వెల్లడించారు. న్యాయం త్వరితగతిన అందాలని దిశ యాక్టు వచ్చిందని.. ఏడు రోజుల్లో కేసుల విచారణ పూర్తవ్వాలి అనేది దిశ ఉద్దేశమని డీజీపీ పేర్కొన్నారు.

396 కేసులు దిశలో ఛార్జ్ షీటు చేశామని.. దిశ అనేది మిగిలిన రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచీ కూడా ఒక టీం వచ్చి దిశ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుందని గౌతం సవాంగ్ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios