అమరావతి: వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. 

ఇప్పటికే పలువురు రాజీనామాలు చేయగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో  కీలక నేత అయిన కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ ర్యాంక్ హోదాలో వ్యవహరిస్తున్నారు. 

అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యాదాలు తెలిపారు. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

అలాగే తన పదవీకాలంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే వైయస్ జగన్ ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసిన తర్వాత ఆయన ఏపీ భవన్ చేరుకున్నారు. ఏపీ భవన్ అధికారులు అంతా జగన్ ను ఘన స్వాగతం పలికారు. 

ఆ సమయంలో ఏపీ భవన్ పై జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అప్పుడు కంభంపాటి రామ్మోహన్ రావు వైయస్ జగన్ ను కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కంభంపాటి రామ్మోహన్ రావు తన పదవికి రాజీనామా చేశారు.  

ఇకపోతే మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా సుధీర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

ఇప్పటికే ఏపీలో పలువురు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. ఎస్వీబీసీ భక్తి ఛానెల్ చైర్మన్ పదవికి కె. రాఘవేంద్రరావు, అంబికా కృష్ణ, వేమూరి ఆనంద సూర్యతోపాటు పలువురు రాజీనామాలు చేశారు.