Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై పోరాటం... ఈ పదింటిని పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సడలింపు, జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించేందుకు సీఎం నీలం సాహ్నీ జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. 

AP CS Nilam Sawhney Meeting With Dist Collectors Over Corona
Author
Amaravathi, First Published May 19, 2020, 11:30 AM IST

అమరావతి: ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గ దర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన  నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ నీలం సాహ్ని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని రాష్ట్రంనుండి పూర్తిగా తరిమేయడానికే ప్రభుత్వం ఈ  నిబంధనలను రూపొందించిందని... వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం జిల్లా యంత్రాగానిదేనని సీఎస్ పేర్కొన్నారు. 

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అధిక సంఖ్యలో టెస్టులకు నిర్వహించి పాజిటివ్ కేసులను గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలని చెప్పారు.రానున్న రెండు వారాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి చోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని అన్నారు.

ఇక జాతీయ రహదారులపై నడిచి వెళుతున్న వలసకూలీలను శిబిరాల్లో పెట్టి ఆహారం ఇతర వసతులు కల్పించి తదుపరి వారిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు కలెక్టర్లు చేసిన కృషిని సిఎస్ నీలం సాహ్ని ప్రత్యేకంగా కొనియాడారు.

ఎపి కరోనాపై పోరాటం (AP Fight against Corona) ఉద్యమంగా చేపట్టి ప్రజల్లో 10అంశాల్లో విస్తృత అవగాహన తేవాలని  సిఎస్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎపి కరోనా పై పోరాటంలో భాగంగా 10 అంశాల్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ను చేపట్టి ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

పది అంశాల్లో ఒకటి కరోనాపై ప్రజల్లో ఉన్న స్టిగ్మా ను తొలగించాలని చెప్పారు. అదే విధంగా ప్రతి చోటా మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరాన్ని పాటించడం, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించడం,చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో తరచు శుభ్రం చేసుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తేవాలని చెప్పారు. అదేవిధంగా కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడం ఇంట్లోనే ఉండేలా ప్రోత్సహించడం, జిల్లా కొవిడ్ ఆసుపత్రుల గురించి ప్రజలందరికీ విస్తృతంగా ప్రచారం చేసి తెలియ జేయాలని పేర్కొన్నారు.

అంతేగాక 65 యేళ్ళు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు,గర్భిణీలు, పదేళ్ళ లోపు వయస్సు గల చిన్నారులు ఇళ్ళలోనే  ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.  పబ్లిక్ ప్రాంతాల్లోను వర్కింగ్ ప్లేసుల్లో ఫాన్, గుట్కా, పోటుగాడు నమిలి ఉమ్మి వేయడం నిషేధమని... అలా చేస్తే శిక్షార్హులవుతారనే అవగాహన ప్రజల్లో తేవాలన్నారు. 

ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లలో భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్క్రీనింగ్ అనంతరం మాత్రమే ఆయా ప్రాంగణాల్లోనికి ప్రజలను అనుమతించడంపై అవగాహన కలిగించాలని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ రవాణా విషయంలో భౌతిక దూరాన్ని పాటించేలా చూడడం.ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించడం వంటి పది ప్రధాన అంశాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ మాట్లాడుతూ... అంతర జిల్లా/రాష్ట్ర రవాణా కు సంబంధించి పరిమితులతో కూడిన రవాణాకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేందుకు అవకాశం లేనిచోట్ల పూర్తి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు.వివిధ అంశాలకు సంబంధించిన ఎస్ఓపి(Standard operating procedures) ప్రామాణిక విధి విధానాలను జిల్లాలకు పంపుతున్నట్లు చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios