ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తనపై ఎన్ని విమర్శలు వచ్చినా దూకుడుగానే వెళుతున్నారు. తాజాగా కొందరు కలెక్టర్లు, అధికారులు ఎన్నికల సంఘానికి సహకరించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందువల్లే సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తన సహాయం కోరారని తెలిపారు. దీంతో బ్యూరోక్రాట్‌లకు బాస్‌గా తాను ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ఇందులో తప్పేమీ లేదని, నిబంధనలకు లోబడే వ్యవహరించానని సమర్ధించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో కలిసి ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. మరోవైపు సీఎస్ వైఖరిని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు.

ఇదే సమయంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా , టీడీపీ నేతలపైనా సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెగ్యులర్ చీఫ్ మినిస్టర్‌కు ఉన్న అధికారాలు ఉండవు. ఆయన తన ఇస్టానుసారం సమీక్షలు నిర్వహించలేరు అని తెలిపారు.

సాంకేతికంగా చంద్రబాబు ‘‘అపద్ధర్మ ముఖ్యమంత్రి’’ కాదని.. ముఖ్యమంత్రేనని.. కాకపోతే పవర్ లెస్ సీఎం అని తేల్చేశారు. మళ్లీ గెలవలేకపోతే మే 23వ తేదీన చంద్రబాబు దిగిపోతారని సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఎవరు సీఎం అయినప్పటికీ రాష్ట్ర అధికార యంత్రాంగం వారికి సహకరిస్తుందని స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అత్యవసర పరిస్ధితులు తలెత్తితే ఏం చేయాలి..? అప్పుడు కూడా సీఎం ఏం చేయకూడదా అని ప్రశ్నించగా.. అలాంటి పరిస్ధితుల్లో ఎన్నికల కోడ్‌కి లోబడి అధికార యంత్రాంగానికి సూచనలు చేయవచ్చుని.. అది కూడా తన ద్వారానే అని సుబ్రమణ్యం తెలిపారు.

ఇప్పటిదాకా సీఎం తనను ఎలాంటి సమీక్షకు ఆహ్వానించలేదని.. కౌంటింగ్‌ ఏర్పాట్లపై తాను నిర్వహించిన సమీక్షకు సంబంధించి టీడీపీ నేతలు చట్టంపై కనీస అవగాహన లేకుండా విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

నిధుల విడుదలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఆర్ధిక మంత్రి యనమల నేరుగా తనను కలిసి, మాట్లాడవచ్చునని సుబ్రమణ్యం స్పష్టం చేశారు.