అమరావతి: టిడిపి ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ రెడ్డిల అనర్హత పిటిషన్ లపై మంగళవారం మండలి ఛైర్మన్ విచారణ జరిపారు. ఈ విచారణకు టీడీపీ తరపున  పిటిషనర్లు బుద్దా వెంకన్న, అశోక్ బాబులు హాజరయ్యారు. అయితే సునీత, శివనాథ రెడ్డిలు మాత్రం హాజరుకాకుండా తమ లాయర్లను పంపించారు. 

ఈ విచారణ అనంతరం బుద్దా మాట్లాడుతూ...ఆరవ వాయిదాకి కూడా ఆరోగ్య కారణాలు చూపుతూ ఇద్దరు ఎమ్మెల్సీలు హజరుకాలేదన్నారు. వస్తే పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టే ఇలా కుంటి సాకులు చెప్పి రాలేరని మండిపడ్డారు. 

వైసిపి ఆశయాలు నచ్చి వెళితే ఆవిషయం ఛైర్మన్ కు వచ్చి చెప్పాల్సిందని పేర్కొన్నారు. ప్రతి వాయిదాకు వారి లాయర్లును పంపుతూ వారుమాత్రం హజరు కాకపోవడం కరెక్టు కాదన్నారు. వచ్చే వాయిదాలో పిటిషన్ పై ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని బుద్దా పేర్కొన్నారు. 

read more  పోలీస్ స్టేషన్లోనే టిడిపి నాయకుడిపై దాడి... ఫోన్ చేసి ధైర్యం చెప్పిన చంద్రబాబు

ఇక మరో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.., టీడీపీ తరపున ఈ విచారణకు హజరయ్యామని అన్నారు. తమ అడ్వకేట్లు క్వారంటైన్ లో ఉండడంతో రాలేకపోయారని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు పార్లమెంటులో ఉన్న పద్దతిలో డిస్ క్వాలిఫికేషన్ ను 3 నెలల్లో ఫైనలైజ్ చేయాలని ఛైర్మన్ ను కోరామన్నారు. 

ప్రతిసారి వారి సాకులను పరిగణలోనికి తీసుకుంటే రెండు సంవత్సరాలు అయినా ఈ పిటిషన్ పై నిర్ణయం రాదన్నారు. వచ్చే వాయిదాలో అయినా ఆ  ఎమ్మెల్సీలను డిస్ క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. 

గతంలో ముఖ్యమంత్రి జగన్ ఎవ్వరు వచ్చినా రిజైన్ చేసి తీసుకుంటామన్నారని.... దానికి కట్టుబడాలని కొరుతున్నామన్నారు. తాము ఛైర్మన్ గారిని వచ్చే వాయిదాలో అయినా మెరిట్స్ ఆధారంగా ఎమ్మెల్సీలు పోతుల, శివనాథ రెడ్డిలపై చర్యలు తసుకోవాలని కోరినట్లు అశోక్ బాబు వెల్లడించారు.