ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 48 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 9,284 సాంపిల్స్ పరీక్షించగా అందులోంచి 48 మంది పాజిటివ్ గా తేలారని ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు తెలిపాయి. 

ఈ 48 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2137 గా ఉంది. 948 యాక్టీవ్ కేసులు ఉండగా, 1142 మంది ఇప్పటివరకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 47 మంది మరణించారు. 

ఏపీలో కొత్తగా కోయంబేడు లింకులవల్ల పాజిటివ్ గా తేలుతున్నారు. నిన్న నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లా నుంచి 3, తూర్పు గోదావరి నుంచి 4 కేసులు కూడా కోయంబేడు నుంచి వచ్చినవారే!

591 కేసులతో కర్నూల్ అత్యంత ప్రభావితమైన జిల్లాగా ఉండగా, 399 కేసులతో గుంటూరు ఆ తరువాతి స్థానంలో ఉంది. ఇకపోతే.... ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 51.49 శాతంగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి. 

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో యాక్టీవ్ కేసులు తగ్గుముఖం పడుతోందన్నారు.

మరణాల శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జవహర్ రెడ్డి తెలిపారు. హైరిస్క్ కేటగిరీ వారిని రక్షించుకోవాల్సి ఉందని, ఇతర వ్యాధులున్న వృద్ధులను రక్షించుకోవాలని ఆయన కోరారు.

అత్యవసర కేసుల్లో ప్లాస్మా సేకరిస్తున్నామని.. దీనిలో భాగంగా స్విమ్స్, కర్నూలు జీజీహెచ్‌‌లో ప్లాస్మా సేకరిస్తున్నట్లు జవహర్ రెడ్డి తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఆయన చెప్పారు.

వలస కార్మికులు, బయటి నుంచి వచ్చే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని... అలా వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చిన కార్మికులకు పరీక్షలు చేస్తుంటే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు.

కర్నూలుకు చేరుకున్న 37 మందికి పాజిటివ్ వచ్చిందని.. అనంతపురం జిల్లాలోనూ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో చిత్తూరు, నెల్లూరు నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. ప్రధాని సూచనల మేరకు లాక్‌డౌన్ నుంచి బయటకు వచ్చే వ్యూహాలు తయారు చేస్తున్నామని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.