బిజెపి అంటేనే బాబు, జగన్, పవన్..: చంద్రబాబు అరెస్ట్ పై తులసిరెడ్డి రియాక్షన్ ఇదే
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఖండించారు. మాజీ సీఎంను ఇలా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరైన పద్దతి కాదన్నారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్ట్ చేయించారని... ఈ దుశ్చర్య దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నట్లు తులసిరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు, మణిపూర్ అల్లర్లపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై చంద్రబాబు గానీ, టిడిపి నాయకులు గానీ స్పందించలేదని తులసిరెడ్డి అన్నారు. కేంద్రం దుశ్చర్యలపై టిడిపి చూసిచూడనట్లు వ్యవహరించినా కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా చేయడంలేదని అన్నారు. చంద్రబాబు విషయంతో జగన్ సర్కార్ అవలంబిస్తున్న తీరును ఖండిస్తున్నామని తులసిరెడ్డి అన్నారు.
టిడిపి, జనసేన పొత్తులపై క్లారిటీ ఇచ్చి బిజెపిని కూడా ఇందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తానన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై తులసిరెడ్డి రియాక్ట్ అయ్యారు. పవన్ చెప్పినదాంట్లో కొత్త విషయమేమీ లేదని... టిడిపి, జనసేన, బిజెపి ఒక్కటేనని అన్నారు. అంతేకాదు వైసిపి కూడా బిజెపి వర్గమేనని అన్నారు. బిజెపి అంటూ బాబు, జగన్, పవన్... వీళ్లంతా అమిత్ షా చేతిలో కీలుబొమ్మలని తులసిరెడ్డి అన్నారు.
Read More చంద్రబాబు బాగానే ఉన్నారు.. ఆందోళన చెందవద్దు - భువనేశ్వరికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్..
విభజన హామీలను మరిచి ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేస్తున్న బిజెపితో ఏపీలోని పార్టీలన్ని కలిసాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను మరిచిన పార్టీలకు ప్రజలే బుద్ది చెప్పాలని... కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని సూచించారు. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఓటేసేముందు రాష్ట్ర భవిష్యత్ గురించి ఒక్కసారి ఆలోచించాలని... కాంగ్రెస్ ను గెలిపించాలని తులసిరెడ్డి ప్రజలను కోరారు.
రాజకీయాల్లో వున్న ఫ్యాక్షనిష్టులు అధికారం లేకుంటే పిరికిపందలని కాంగ్రెస్ నేత అన్నారు. అందువల్లే ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చి జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అయ్యిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి.