విజయవాడ: మహారాష్ట్రలో  జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. 

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అయితే పదవుల పంపకంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతటి మహారాష్ట్రకు ఒక్కరే డిప్యూటీ సీఎం అని తాను ఐదుగురికి ఇచ్చానని చెప్పుకొచ్చారు. 

ఆ డిప్యూటీ సీఎం పదవి కూడా ఎన్సీపీకి కేటాయించారని అయితే కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. అయితే తన కేబినెట్లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు. 

అలాగే దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తాను ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఇచ్చానని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు సీఎం జగన్.