అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ ఒక్కరికీ చక్కటి కంటిచూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 10 నుంచి వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

అమరావతిలోని సచివాలయంలో వైద్య,ఆరోగ్య శాఖపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో వైద్య సేవలపై ఆరా తీశారు. 108 సేవలు, ఆరోగ్యశ్రీ పథకం అమలు, మెడికల్ కళాశాలలు, క్యాన్సర్ ఆస్పత్రులు, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్స్ పై చర్చించారు. 

క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తే ప్రజలు ఇతర ప్రాంతాల్లో వెళ్లి చూపించుకోలేక చనిపోతున్నారని ఈ తరుణంలో అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో 5 క్యాన్సర్ ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్. పూర్తిస్థాయి సదుపాయాలతో రాష్ట్రంలో 5 క్యాన్సర్ ఆస్పత్రులు నిర్మించబోతున్నట్లు జగన్ ప్రకటించారు. 

కడప, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, గుంటూరు జిల్లా కేంద్రాలలో క్యాన్సర్ ఆస్పత్రుల నిర్వహణకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే  శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కళాశాలలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 

ఇకపోతే ప్రతీ ఒక్క కుటుంబానికి హెల్త్ కార్డు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి క్యూ అర్ కోడ్ తో హెల్త్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతీ కుటుంబం ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండేలా కార్యక్రమాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 

ఈ నేపథ్యంలో డిసెంబర్ 21 నుంచి హెల్త్ కార్డులు జారీ ప్రారంభించాలని జగన్ ఆదేశించారు. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేయనున్నట్లు తెలిపారు. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీతో సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. 

జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. 3నెలలపాటు పథకం అమలుకు అధ్యయనం చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం జగన్ రివ్యూలో స్పష్టం చేశారు. ఇకపోతే జాబితాలో చేర్చాల్సిన వ్యాధుల జాబితా తయారు చేయాలని కూడా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో 150 ఆస్పత్రుల్లో అందుబాటులో తేనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలలో 150 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 

నవంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నట్లు జగన్ స్పష్టం చేశారు. ఇకపోతే 108, 104 వాహనాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఆరేళ్లకోసారి వాహనాలను మార్చాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఆదేశించారు.