హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గురువారం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

తనకు బదులు తన న్యాయవాది హాజరయ్యేలా అనుమతి మంజూరు చేయాలని పిటీషన్లో కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. 

ఇకపోతే ఇటీవలే సీఎం జగన్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ తీపి కబురు అందించింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వాన్ పిక్, భారతి సిమ్మెంట్ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 

అంతేకాదు జగన్ ఆస్తులను అటాచ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. జగన్ ఆస్తుల కేసులో ఈడీ జగన్ కు చెందిన రూ.746 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇడుపుపాయలోని 42 ఎకరాలభూమి, పులివెందులలో 16 ఎరాలు, బంజారాహిల్స్ లో సాగర్ సొసైటీలో ప్లాట్లు, ఓ కమర్షియల్ స్థలం, షేర్లు, ఓ టీవీ ఛానెల్ కు సంబంధించిన యంత్రాలను జప్తు చేసింది. వాటన్నంటిని తక్షణమే విడుదల చేయాలని ఈ ఏడాది జూలైలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆస్తుల కేసులో సీఎం జగన్ కు ఊరట: ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని ఈడీకి ట్రిబ్యునల్ ఆదేశం