అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

జెరూసలేంలో పర్యటనలో ఉన్న సీఎం ఉభయోగదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న దానిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. 

ఇకపోతే ఉభయగోదావరి జిల్లాలలో లంక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై జగన్ ఆరా తీశారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు జగన్ సూచించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామాగ్రి అందించాలని ఆదేశించారు. మరోవైపు ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.