కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేయగలిగామని సీఎం అధికారులను ప్రశంసించారు.

కరోనా నిర్థారణ పరీక్షల పరంగా చూస్తే దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని.. ప్రతి 10 లక్షల జనాభాకు 2,500కి పైగా పరీక్షలు చేస్తున్నామని, ఇది ఒక రికార్డు అని జగన్ తెలిపారు.

Also Read:మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబే: వైసీపీ ఎమ్మెల్యే అంబటి

కరోనాతో పాటు రానున్న ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ అంశాలపై ముఖ్యమంత్రి పరీక్ష నిర్వహించారు. సంక్షోభ సమయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరు కనబరిచారని జగన్ ప్రశంసించారు.

35 రోజుల క్రితం రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్ తప్ప మరెక్కడా కరోనా పరీక్షలు చేసే సౌకర్యం లేదని.. అక్కడ కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం 11 జిల్లాల్లో కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read:టీచర్లు, పోలీసులతో లిక్కర్ షాపుల నిర్వహణా: జగన్‌పై చంద్రబాబు ఫైర్

ట్రూనాట్ కిట్లు సైతం అన్ని ఆసుపత్రుల్లో ఉన్నాయని, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో ఏపీకి బలమైన నెట్‌వర్క్ ఉందని సీఎం చెప్పారు. కరోనాను ఎంత కట్టడి చేయాలనుకుంటున్నా.. అది ఎక్కడో ఓ చోట కనిపిస్తోందని, వైరస్ జీవితంలో భాగమని, దానితో కలిసి జీవించాల్సి ఉంటుందని జగన్ పునరుద్ఘాటించారు.

కోవిడ్ మరణాల రేటు కేవలం 2 శాతంలోపే ఉందని... వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఇది ప్రభావం చూపుతోందని సీఎం తెలిపారు.