అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. 

మహాత్మ జ్యోతిభాపూలే 129వ వర్థంతి సభలో పాల్గొన్న సీఎం జగన్ బీసీలను తాను గుర్తించానన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ అంటూ చెప్పుకొచ్చారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తన కేబినెట్లో 60 శాతం మంత్రి వర్గం కూర్పు, ఎస్సీ ఎస్టీ బీసీలేనని చెప్పుకొచ్చారు. 

బీసీల అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ల నియామకాలను కూడా రిజర్వేషన్లు వర్తించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ యార్డు కమిటీలు ఉంటే వాటిలో 10 ఎస్సీ, ఎస్టీ బీసీలకే కేటాయించేలా చట్టం తీసుకువచ్చామని తెలిపారు. 

అలాగే నామినేటెడ్ పదవులు విషయంలో కూడా 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించినట్లు జగన్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తేనని చెప్పుకొచ్చారు. ఇలా ఎవరూ ఊహించని విధంగా తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు జగన్ తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఆర్థిక మాంద్యంతో దేశమంతా విలవిలలాడుతూ ఉద్యోగాలు పోతున్న తరుణంలో తాను మాత్రం 4లక్షలు ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 

ఐదు నెలలుగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు. వైయస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 2 లక్షల 36వేల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చామంటే అది తమ ప్రభుత్వం పనితీరు అని చెప్పుకొచ్చారు.  

చంద్రబాబు నాయుడు పోతూపోతూ తనకు మంచి వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పగించలేదన్నారు సీఎం జగన్. ప్రతీ అడుగులోనూ అప్పులు, ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. రాష్ట్రం పరిస్థితి బాగోలేదని తాను ఏనాడూ బెదిరిపోలేదన్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని వంకతో తాను సంక్షే పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదన్నారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకం పేరుతో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా పెట్టుబడి సాయంగా అందించినట్లు చెప్పుకొచ్చారు. 

అలాగే కౌలు రైతులకు కూడా సహాయం అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. మత్స్యకారుల సోదరుల అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఏడాదికి పెన్షన్లు సగటు పెన్షన్లు రూ.500 కోట్లు చెల్లిస్తే తమ ప్రభుత్వం నెలకు సగటున రూ.1400 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. 

సమాజంలో తప్పు జరిగితే దానిపై యుద్ధం చేయగలిగితేనే మనుషులు గొప్పవాళ్లవుతారని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీషు మీడియం చదువులు లేవని సీఎం జగన్ తెలిపారు. 

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ లలో ఇంగ్లీషు మీడియం అమలులో ఉందని తెలిపారు. అన్ని ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీషు మీడియం చదువులేనని తెలిపారు. ప్రముఖులు, పత్రికాధిపతులు, సినీనటుల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఇంగ్లీషు మీడియం చదువుకోవచ్చు గానీ పేదవాళ్లు ఇంగ్లీషు మీడియం చదివితే మన సంస్కృతి చెడిపోతుందంట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పేదవాళ్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదవితే సంస్కృతి పోతుందా మీవాళ్లు చదివితే పోదా అంటూ నిలదీశారు సీఎం జగన్. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం అమలు జరిగి తీరుతుందని హెచ్చరించారు. 

జవనరి 9న అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. బడికి పంపిన తల్లికి రూ.15వేలు చెల్లిస్తామన్నారు. చదువులు ఎండమావులుగా ఉండకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

నువ్వు చదువు నేనుంటా అని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి ఎంతవరకు చదివినా వారికి తాము తోడుగా ఉంటామని తెలిపారు. ఇంజనీర్లు, డాక్టర్లను కూడా చేసి తీరతామన్నారు. 

వసతి దీవెన కింద ప్రతీ ఏడాది విద్యార్థికి రూ.20వేలు అందించబోతున్నట్లు తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 21న తన పుట్టిన రోజు అని స్పష్టం చేశారు సీఎం జగన్. తన పుట్టిన రోజు చేనేత కార్మికులు గుర్తుకు వచ్చారని తెలిపారు. 

మగ్గం ఉన్న ప్రతీ చేనేత కార్మికుడికి అండగా నిలబడాలనే గొప్ప ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలాగే దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉగాది నాటికి లక్షరాలా 24లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు సీఎం జగన్.