రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదును రేపు రైతుల ఖాతాలో జమచేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరతారు. ఉదయం 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రభుత్వ జేఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు జగన్. కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను బదిలీ చేస్తారు ముఖ్యమంత్రి. అనంతరం 12.35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆళ్లగడ్డలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ సామాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశంలోని కోట్లాదిమంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు 2000 చొప్పున మొత్తం మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేస్తుంది.
ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశారు. ఏటా మొదటి విడత ఏప్రిల్ నుంచి జూలై మధ్య రైతులకు అందజేస్తారు. రెండవ విడత ఆగస్టు, నవంబర్ మధ్య విడుదల చేస్తారు. కాగా మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్య విడుదల చేస్తారు.
