పోలవరం: ఈనెల 20న పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్ పరిశీలించనున్న నేపథ్యంలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యేలు బాలరాజు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలు పరిశీలించారు. 

పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన పనులు చేపట్టారని ఆయన తనయుడు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారంటూ డిప్యూటీ సీఎం ఆళ్లనాని స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ఆదాయ వనరుగా చూసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఒక పబ్లిసిటీ స్టంట్ గా ఆ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దాన్ని ప్రారంభించే బాధ్యత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. 

ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ఉపయోగమో నిర్వాసితులను ఆదుకోవడం కూడా అంతే బాధ్యతగా సీఎం వైయస్ జగన్ వ్యవహరించాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో గానీ, నిర్వాసితుల విషయంలో గానీ చాలా దారుణంగా వ్యవహరించిందన్నారు. 

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వైయస్ జగన్ వస్తున్న తరుణంలో నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం చేశారు. 

ఇకపోతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు యదార్థ స్థితిపై వివరాలు తెలుసుకోనున్నారు సీఎం వైయస్ జగన్.