Asianet News TeluguAsianet News Telugu

పనిచేస్తున్నారో లేదో , నా మనుషుల నిఘాలోనే .. మీ వల్లకాకుంటే : నేతలకు జగన్ హెచ్చరికలు

తాడేపల్లిలో వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పని చేయలేకపోతే ముందే చెప్పేయాలని.. మీరు పనిచేస్తున్నారో లేదో పర్యవేక్షించడానికి తన మనుషులు వుంటారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

ap cm ys jagan warns ysrcp leaders
Author
First Published Dec 8, 2022, 7:02 PM IST

వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీకి వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, అన్ని నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా పని చేయాలని.. పని చేయలేకపోతే ముందే చెప్పేయాలని జగన్ తేల్చేశారు. మీరు పనిచేస్తున్నారో లేదో పర్యవేక్షించడానికి తన మనుషులు వుంటారని, మీరు పనిచేయకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. పని చేసినవాళ్లకు తగిన గుర్తింపు వుంటుందని జగన్ తెలిపారు. 

ఇక ఇదే సమావేశంలో.. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు వుండాలని.. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలని జగన్ సూచించారు. 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీలను 10 రోజుల్లో పూర్తి చేయాలని.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు నాయకుల మానిటరింగ్ బాధ్యతల్ని అప్పగించాలని జగన్ సూచించారు. ఇద్దరిలో ఒక మహిళా నాయకురాలు, ఒక నాయకుడు వుండాలన్నారు. ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతను అబ్జర్వర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ALso REad:ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులు , ఎమ్మెల్యే బాధ్యత అబ్జర్వర్లదే : పార్టీ నేతలతో జగన్

అంతకుముందు విజయవాడలో బుధవారంనాడు నిర్వహించిన జయహో బీసీ మహాసభలో వైఎస్ జగన్  ప్రసంగిస్తూ... సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నట్టుగా ఆయన వివరించారు. తమ ప్రభుత్వ ప్రతి అడుగులో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తన మంత్రివర్గంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం ప్రాతినిథ్యం కల్పించామన్నారు.ఐదుగురు డిప్యూటీ సీఎంలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని సీఎం  జగన్  చెప్పారు. చరిత్రలో ఏనాడూ లేని విధంగా అడుగులు వేసినట్టుగా జగన్  తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మూడున్నరఏళ్లలో రూ. 3.19 లక్షల కోట్లకు పైగా లబ్ది పొందారని సీఎం వివరించారు.

చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో  ఏ  ఒక్క బీసీని  కూడా రాజ్యసభకు పంపలేదన్నారు. తమ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో  రాజ్యసభకు పంపిన ఎనిమిది మందిలో నలుగురు  బీసీలేనని జగన్ గుర్తు చేశారు. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్దపీట వేశామన్నారు.చంద్రబాబు పాలనలో అదే బడ్జెట్ తన పాలనలో అదే బడ్జెట్ అని జగన్ గుర్తు చేశారు. అప్పుల్లో పెరుగుదల రేటు చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా ఇప్పుడే తక్కువగా ఉందని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు హయంలో  పథకాలు ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. చంద్రబాబు సర్కార్ లో నలుగురు మాత్రమే బడ్జెట్ ను పంచుకొనేవారని జగన్ ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios