తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఖరారు అయ్యింది. వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 30 రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

సోమవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు సీఎం జగన్. 3గంటలకు తిరుచానూరు చేరుకుని అక్కడ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. 

అనంతరం సాయంత్రం 4.15 నిమిషాలకు అలిపిరి-చెర్లోపల్లి నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.15 నిమిషాలకు నందకం అతిథి గృహం వద్ద వకుళామాత అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం యాత్రికుల ఉచిత సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. రాత్రి 7.05 నిమిషాలకు బేడి ఆంజనేయస్వామి వద్ద నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ తొలిసారిగా స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.