అమరావతి: ఏపీ కేబినెట్ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ఇప్పటికే తన కేబినెట్ కూర్పును దాదాపుగా పూర్తి చేశారు. 19 మందికి మంత్రులుగా అవకాశం కల్పిస్తూ వైయస్ జగన్ తన టీం ను రెడీ చేసుకున్నారు. మరో ఆరుగురి కోసం కసరత్తు చేస్తున్నారు. 

ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వడపోతకు రెడీ అవుతున్నారు. మెదటి లిస్ట్ ప్రిపేర్ చేసిన జగన్ పరిశీలనలో పదిమంది జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆ పదిమంది జాబితాలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పదిమందిలో మెుదటి పేరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉన్నారు. 

శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం, వి.కళావతిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇకపోతే విజయనగరం జిల్లా నుంచి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పేరు పరిశీలనలో ఉంది. ఈమెకు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించే యోచనలో వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కరణం ధర్మశ్రీ,  ముత్యాల నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, నెల్లూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఆరుగురికి జగన్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది.  
 
ఇప్పటికే వైయస్ జగన్ చేతిలో 19 మంది మంత్రుల జాబితా సిద్ధంగా ఉంది. ఈరోజు జరగనున్న శాసనసభా పక్ష సమావేశంలో మెుత్తం జాబితాను ఖరారు చేసి సాయంత్రానికల్లా జగన్ తన టీంని బయటపెట్టబోతున్నారు. 

ఇకపోతే మంత్రులంతా జూన్ 8 అంటే శనివారం ఉదయం 9.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతిలోని సచివాలయం పక్కన మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ నరసింహన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం జగన్ కేబినెట్ కూర్పు సిద్ధం: 19 మందిలో చోటు దక్కించుకోని రోజా