Asianet News TeluguAsianet News Telugu

చెడిపోయిన వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం, గ్లాసులో నీళ్లున్నా.. లేవంటారు : చంద్రబాబుపై జగన్ విమర్శలు

గ్లాసులో నీళ్లున్నా.. చంద్రబాబు నీళ్లు లేవని ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మనం చేసిన అప్పులు తక్కువేనని జగన్ పేర్కొన్నారు. 

ap cm ys jagan slams tdp chief chandrababu naidu at pulivendula
Author
First Published Dec 24, 2022, 3:56 PM IST

మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. శనివారం కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తూ.. లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయిందని జగన్ ప్రశ్నించారు. విద్యార్ధులు, పేదలు , రైతుల తలరాతలు మారుతున్నాయని.. పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని జగన్ చెప్పారు. 

గత ప్రభుత్వంతో పోలిస్తే మనం చేసిన అప్పులు తక్కువేనని.. రూ.1.71 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం పేర్కొన్నారు. ఈసారి 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. గ్లాసులో నీళ్లున్నా.. చంద్రబాబు నీళ్లు లేవని ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో సమగ్రంగా నీటి సరఫరా పథకం ప్రారంభంచామని జగన్ పేర్కొన్నారు. వేంపల్లిలో రహదారుల విస్తరణకు భూసేకరణ కూడా జరిగిందని సీఎం చెప్పారు. పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మార్చి 2023 నాటికి పూర్తవుతుందని జగన్ తెలిపారు. 

Also REad: ఈ భార్య కాకపోతే మరో భార్య అనను:కమలాపురంలో పవన్ పై జగన్ ఫైర్

ఇకపోతే.. నిన్న కమలాపురంలో జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు మాదిరిగా  తనకు  వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా  ఈ భార్య కాకపోతే  మరో భార్య అని కూడా తాను  అనడం లేదని  సీఎం జగన్  పవన్ కళ్యాణ్ పై  తీవ్ర విమర్శలు గుప్పించారు. తనది ఇదే రాష్ట్రమని.. ఇక్కడే నివాసం ఉంటానని  ఆయన  తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో  రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని  విభజన చట్టంలో  పేర్కొన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.ఈ విషయాన్నిఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలోని  నేతలు కూడా పట్టించుకోలేదని  సీఎం జగన్ విమర్శించారు. కడపలో  రూ. 8800 కోట్లతో  స్టీల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్టుగా  సీఎం  ప్రకటించారు.

తమ ప్రభుత్వం నిరుపేదల, మహిళ, రైతు పక్షపాతిగా  పేరొందిన విషయం తెలిసిందేనన్నారు.  ఎక్కడా కూడా  లంచాలు, వివక్షాలకు తావు లేకుండా  ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు  అందుతున్నాయని  సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో  పెన్షన్ రావాలంటే  లంచాలు  ఇవ్వాల్సిన  దుస్థితి ఉండేదన్నారు. అర్హులైన వారికి  లంచాలు లేకుండా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.  గత ప్రభుత్వానికి  తమ ప్రభుత్వానికి  తేడాను గమనించాలని  సీఎం  జగన్ కోరారు.  నాయకుడనే వాడికి విశ్వసనీయత  ఉండాలని  సీఎం  చెప్పారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios