ఈ భార్య కాకపోతే మరో భార్య అనను:కమలాపురంలో పవన్ పై జగన్ ఫైర్
చంద్రబాబు మాదిరిగా తనకు వేరే రాష్ట్రం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇదే తన రాష్ట్రం, ఇక్కడే తన నివాసమని ఆయన తేల్చి చెప్పారు.
కడప: చంద్రబాబు మాదిరిగా తనకు వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా తాను అనడం లేదని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఉమ్మడి కడప జిల్లాలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో శుక్రవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు.తనది ఇదే రాష్ట్రమన్నారు. ఇక్కడే నివాసం ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. తనపైౌ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శలకు జగన్ కౌంటరిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2014లో మాదిరిగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ నెల 21న తెలంగాణలోని ఖమ్మంలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లపై విమర్శలు గుప్పించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా నది నీళ్లను కడప జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. అంతకు ముందు ఎంతమంది సీఎంలున్నా కూడా జిల్లాకు కృష్ణా నది నీళ్లు తేలేదన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే కడప జిల్లాలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో ఎవరూ కూడా ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గాలేరు నగరిని తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టు పూర్తైందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జిల్లాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని జగన్ చెప్పారు.చిత్రావతి ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చిత్రావతి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినట్టుగా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.
బ్రహ్మంసాగర్ కు రూ,. 550 కోట్లు ఖర్చు చేసినట్టుగా సీఎం జగన్ గుర్తు చేశారు. కూ. 6914 కోట్లతో అభివృద్ది పనులను చేపట్టామన్నారు సీఎం జగన్, 550 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసినట్టుగా సీఎం తెలిపారు. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తైతే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం వివరించారు. కమలాపురానికి బైపాస్ రోడ్డును నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కమలాపురంలో రూ.905 కోట్ల అభివృద్ది పనులు చేపట్టినట్టుగా సీఎం జగన్ వివరించారు. కడప స్టీల్ ప్యాక్టరీ నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో శంకుస్థాపన చేస్తామని ఏపీ సీఎం జగన్ చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయాన్నిఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలోని నేతలు కూడా పట్టించుకోలేదని సీఎం జగన్ విమర్శించారు.కడపలో రూ. 8800 కోట్లతో స్టీల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.
తమ ప్రభుత్వం నిరుపేదల, మహిళ, రైతు పక్షపాతిగా పేరొందిన విషయం తెలిసిందేనన్నారు. ఎక్కడా కూడా లంచాలు, వివక్షాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయని సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో పెన్షన్ రావాలంటే లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఉండేదన్నారు. అర్హులైన వారికి లంచాలు లేకుండా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడాను గమనించాలని సీఎం జగన్ కోరారు. నాయకుడనే వాడికి విశ్వసనీయత ఉండాలని సీఎం జగన్ చెప్పారు.