అమరావతి:  ఎస్సీలంటే టీడీపీ నేతలకు ప్రేమ లేదని, ఈ కారణంగానే ఆ పార్టీ ఒక్క ఎస్సీ రిజర్వుడు స్థానంలోనే విజయం సాధించిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.  

ఏపీ అసెంబ్లీలో  మంగళవారం నాడు ఎస్సీ కమిషన్ బిల్లుపై ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రసంగించారు. ఎస్సీ కమిషన్  బిల్లుపై చర్చ సమయంలో  టీడీపీ సభ్యులు   జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ టీడీపీ తీరును ఎండగట్టారు.

శాసనమండలిలో టీడీపీ పాలనా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఎస్సీ కమిషన్ బిల్లును కూడ అడ్డుకోవాలని  చూస్తోందన్నారు. టీడీపీ సభ్యులు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.  

టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఎందుకు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదన్నారు.  ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ జరిగే సమయంలో టీడీపీ సభ్యులు చర్చకు అడ్డుపడడం ఎస్సీలపై టీడీపీకి ఉన్న ప్రేమకు అద్దం పడుతోందని  సీఎం జగన్  ఎద్దేవా చేశారు.

ఎస్సీ కమిషన్ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకొన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.  ఎస్సీలకు మూడు కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు. జనసేన సభ్యుడు కూడ తమకు మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ తేల్చి చెప్పారు.  ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో  టీడీపీ ఒక్క స్థానంలోనే విజయం సాధించిన విషయాన్ని జగన్  గుర్తు చేశారు.

 తమ ప్రభుత్వ హాయంలోనే ఎస్సీలకు న్యాయం జరిగిందని  జగన్ ప్రకటించారు. ఆరుగురు దళితులకు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని జగన్  గుర్తు చేవారు.  ఎస్సీలంతా బాధపడేలా టీడీపీ వ్యవహరిస్తోందని జగన్  విమర్శలు గుప్పించారు.