ఏపీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (ap budget session) ప్రారంభంరోజే అసెంబ్లీ (ap assembly)లో గందరగోళం సృష్టించిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ (harichandra biswabhushan) ప్రసంగాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించడం గురించి బిఎసి సమావేశంలో సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సందర్బంగా అసెంబ్లీలో ఎన్నడూల‌ేని విధంగా వ్యవహరించారంటూ టిడిపి (TDP) తరపున బిఎసిలో పాల్గొన్న కింజరాపు అచ్చెన్నాయుడుపై సీరియస్ అయినట్లు సమాచారం. 

బాద్యతాయుతమైన ప్రతిపక్షంలో వుండి సభాసాంప్రదాయాలను మంటగలుపుతూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం దారుణమని సీఎం అచ్చెన్నతో అన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ఏ పార్టీకి చెందిన వారు కాదు... వయసులోనూ చాలా పెద్దమనిషి... అలాంటి ఆయనను అవమానించడం సరికాదంటూ అచ్చెన్నాయుడి ముందు టిడిపి తీరుపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 

వీడియో

రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఇవాళే(సోమవారం) ప్రారంభమయ్యాయి. అయితే రెండుచోట్లా ఈ సమావేశాలు విభిన్నంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అసలు గవర్నర్ ప్రసంగమే లేకుండా డైరెక్ట్ గా ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఏపీలో గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ ప్రారంభమైనా ప్రతిపక్ష టిడిపి గందరగోళం మద్యే సాగింది. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని టిడిపి బహిష్కరించి సభ నుండి వాకౌట్ చేసింది.

ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే రాజ్యాంగాన్ని కాపాడలేకపోతున్న గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారు. అసెంబ్లీలోనే గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేసిన టీడీపీ సభ్యులు గందరగోళం స‌ృష్టించారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. టీడీపీ తీరుపై సీఎం జగన్ సభలోనూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

కొద్దిసేపు ఇలాగే గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వారు సభలో నుంచి వెళ్లిపోయారు. ప్రసంగం ముగిసిన తర్వాత కూడా గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులను వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. తర్వాత అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు బైఠాయించారు.

ఇదిలావుంటే గవర్నర్ ప్రసంగంలో పలు ఆసక్తికర ప్రకటనలున్నాయి. గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కౄషి చేస్తోందని గవర్నర్ చెప్పారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తుందని గవర్నర్ చెప్పారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాల్లో మైరుగైన అభివృద్దిని సాధించామన్నారు. కరోనాతో దేశం, రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పాలనను కిందిస్థాయి వరకు వర్తింపసేసేలా గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయని గవర్నర్ చెప్పారు.

 పార్లమెంటరీ నియోజకవర్గానికి కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా గవర్నర్ వివరించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. 2021-22 లో రూ. 9091 కోట్లతో రైతులకు ప్రయోజనం చేకూర్చామన్నారు రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ., 20,162 కోట్ల సహాయం అందించామని గవర్నర్ తెలిపారు.