నకిలీ వార్తలు సృష్టించే వారిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం, వాస్తవాలు మరుగున పెట్టి, అసత్యాలు ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

Also Read:ఏపీలో మరణ మృదంగం: కొత్తగా 11,434 మందికి పాజిటివ్.. గుంటూరు అతలాకుతలం

అవసరమైతే వారిని అరెస్టు చేసి.. జైలుకు పంపే అధికారం కూడా మీకు ఉందన్న అధికారులకు జగన్ గుర్తుచేశారు. ఈ విషయంలో అవసరమైతే అందరు ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి రోజూ కరోనాపై అఫీషియల్‌ బులెటిన్‌ ఇస్తారని.. దాన్నే అందరూ తీసుకోవాలి జగన్ సూచించారు.

కోవిడ్‌ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అసత్యాలు ప్రచారం చేయొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వాటి వల్ల ప్రజల్లో ఆందోళన ఇంకా తీవ్రమవుతుందని.. కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని జగన్ అధికారులను ఆదేశించారు.