పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.

విజయవాడ: పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత ప్రత్యేక వాహనంపై పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం ప్రసంగించిన జగన్.. ‘‘వికేంద్రీకరణను ఒక విధానంగా చేస్తూ.. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. రాజధానులను మూడు ప్రాంతాల హక్కు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని వికేంద్రీకరణ చేయబోతున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. 

బలహీన వర్గాల సాధికారత కోసం కృషి చేయడం, పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు రాష్ట్రంలోని ప్రజలకు సామాజిక న్యాయం చేకూర్చినట్టుగా సీఎం జగన్ తెలిపారు. మహాత్మాగాంధీ చూపిన గ్రామస్వరాజ్యానికి నాంది పలికేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇది వ్యవసాయం, పరిశ్రమలు, సేవల ముఖచిత్రాన్ని మార్చిందని తెలిపారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ 15,000 గ్రామ, వార్డు సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, ఆర్‌బీకేలు, వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రజలకు త్వరిత పౌర సేవలను అందించడానికి గ్రామీణ పరిపాలనా వ్యవస్థలో పెద్ద మార్పులను తీసుకువచ్చాం. దశాబ్దాల నాటి అవినీతి పాలనా వ్యవస్థను తిప్పికొట్టేందుకు ఈ మార్పులు దోహదపడ్డాయి. గత 50 నెలల్లో లబ్ధిదారులకు డీబీటీ మోడ్ ద్వారా ప్రభుత్వం రూ. 2,31,000 కోట్లు బదిలీ చేసింది. 

అంటరానితనంపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని సీఎం జగన్ అన్నారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం వంటి వాటిని వ్యతిరేకించడం కూడా అంటరానితనమేనని చెప్పారు. పేదలకు న్యాయం జరిగే వరకు యుద్ధం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు రిజర్వు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసేలా చట్టం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సీఎం జగన్ చెప్పారు. పారిశ్రామిక రంగంలో కూడా రాష్ట్రం ముందుకెళ్తోందని.. ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశంలో రూ. 13,42,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఏపీలో గత నాలుగేళ్లలో రూ.67,196 కోట్ల పెట్టుబడితో 127 భారీ పరిశ్రమలు స్థాపించి 84,607 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలు, సాంకేతిక సమస్యలను అధిగమించామని.. ప్రస్తుతం పనులు వడివడిగా జరుగుతున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. 2025 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు.