కుప్పంలో ఒక్క చాన్సిస్తే ప్రతి ఇంటికి కిలో బంగారం: బాబుపై జగన్ సెటైర్లు
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. కుప్పం ప్రజలను మరోసారి ఒక్కచాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
గుడివాడ: పది నెలల్లో ఎన్నికలు రానున్ననేపథ్యంలో ప్రజలకు హమీలు కురిపిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. 30 ఏళ్లకు పైగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం ప్రజలకు కూడ మరో చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని చంద్రబాబును ఎద్దేవా చేశారు సీఎం జగన్.
తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు తనను అనుమతి కోరుతున్నారన్నారు. మరో చాన్స్ ఇవ్వండి చేసేస్తాను, ఇంకో చాన్స్ ఎక్కువ చేస్తాను, ఇంకో చాన్సివ్వండి ప్రతి ఇంటికి కిలో బంగారం, మరో చాన్సిస్తే ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తానని చంద్రబాబు హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఏదైనా మంచి పని ఉందా అని ఆయన అడిగారు. చంద్రబాబునాయుడు పేదల వ్యతిరేకి అని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరుపై అప్పుగా రాశాడన్నారు.పేదలు నెలకు రూ. 3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు ఈ డబ్బులు చెల్లించాలని చంద్రబాబు సర్కార్ చెప్పిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం రూపాయికే ఈ ఇళ్లను పేదలకు కేటాయించిందన్నారు.
తాను చేయని పని చేసినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని ఆయన విమర్శించారు. గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంట్ స్థలం, ఇళ్లు ఇవ్వలేదని సీఎం జగన్ విమర్శించారు.
also read:వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారు: పవన్ కళ్యాణ్ పై జగన్ సెటైర్లు
అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకొనే ప్రయత్నం చేశారని చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలుపంపిణీ చేశామన్నారు.