కుప్పానికి ఏం చేశాడు, ఇంత చేతకాని నేతను చూడలేదు: చంద్రబాబుపై జగన్ ఫైర్
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఏం చేశాడని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన నేత కనీసం నియోజకవర్గంలో మంచినీటి సమస్యను కూడా పరిష్కరించలేదని ఆయన ఎద్దేవా చేశారు.
కుప్పం: హైద్రాబాద్ కు చంద్రబాబు లోకల్, కుప్పానికి నాన్ లోకల్ అని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు కుప్పంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
వెన్నుపోటు, దొంగఓటుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని సీఎం జగన్ అన్నారు. దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు గురించి జిల్లాలో కథలు కథలుగా చెప్పుకొంటారని సీఎం జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమలాంటిదే కుప్పంపై చంద్రబాబుకు ఉందని జగన్ సెటైర్లు వేశారు.
కుప్పం నుండి చంద్రబాబు నాయుడు చాలా తీసుకున్నారన్నారు. కానీ కుప్పానికి మాత్రం ఏమీ చేయలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న కూడా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేయలేదన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా వేయించలేదని సీఎంజగన్ విమర్శించారు. మంచినీటి సమస్యను పరిష్కరించలేదన్నారు. హంద్రీనీవాకు చంద్రబాబే అడ్డు అని జగన్ ఆరోపించారు. తన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారన్నారు. కుప్పంలో కనీసం డబుల్ రోడ్లు వేయలేని చంద్రబాబునాయుడు ఎన్నికలు వచ్చేనాటికి విమానాశ్రయం తీసుకు వస్తానని మాత్రం హమీ ఇస్తారని జగన్ ఎద్దేవా చేశారు. కుప్పానికి చంద్రబాబు అన్యాయం చేశాడన్నారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం నుండి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడని జగన్ చెప్పారు. సీఎంగా ఉన్న వ్యక్తి కుప్పంలో రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయలేదన్నారు. స్థానిక ప్రజలు రెవిన్యూ డివిజన్ కోసం ఆందోళన చేస్తే చంద్రబాబు తనకు లేఖ రాశాడని జగన్ గుర్తు చేశారు. ఇంతకన్నా చేతకాని నాయకుడు ఎవరైనా ఉన్నారా జగన్ ప్రశ్నించారు. కుప్పం నుండి ఇంత కాలంలో ఎన్నికైన చంద్రబాబు కుప్పంలో ఓటు లేదన్నారు. కనీసం ఇల్లు కూడా ఆయనకు లేదన్నారు. కుప్పం కంటే చంద్రబాబుకు హైద్రాబాదే ముద్దు అని జగన్ విమర్శించారు.
చంద్రబాబుకు తలవంచేది లేదని 2019 తర్వాత కుప్పం ప్రజలు తేల్చి చెప్పారన్నారు. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కుప్పం ప్రజలు వైసీపీకి అండగా నిలిచారని సీఎం జగన్ గుర్తు చేశారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారన్నారు. బీసీల సీటులో చంద్రబాబు పోటీ చేస్తున్నాడన్నారు. 1983 నుండి ఇప్పటివరకు కుప్పం సీటును బీసీలకు ఇవ్వలేదన్నారు. ఇలాంటి చంద్రబాబు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతుంటారన్నారు. ఇది బాబు మార్క్ సామాజిక న్యాయమని జగన్ విమర్శించారు.
also read:వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ రూ. 2750కి పెంపు: కుప్పంలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం తపిస్తుందేవరు, బీసీలను రాజకీయంగా వాడుకొంటుందేవరో ఆలోచించాలని జగన్ ప్రజలను కోరారు. కుప్పం ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో రూ. 1149 కోట్లతో పలు పథకాలు అందించినట్టుగా సీఎం జగన్ చెప్పారు.
భరత్ ను మంత్రిని చేస్తా
బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ ఎమ్మెల్సీగా ఉంటూ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి వందల కోట్ల అభివృద్ది పనులు చేయించారని సీఎం జగన్ చెప్పారు. భరత్ ను కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గానికి తన నియోజకవర్గంగా భావిస్తానని సీఎం జగన్ ప్రకటించారు. కుప్పం అభివృద్దికి మరో రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం జగన్ చెప్పారు.