అమరావతి: ఆశావర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీపికబురు చెప్పారు. ఆశావర్కర్ల జీతాన్ని పెంచుతూ వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో వైద్యఆరోగ్య శాఖపై సమీక్షలు నిర్వహించిన ఆయన అనంతరం ఆశా వర్కర్ల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

ఆశావర్కర్ల జీతం నెలకు రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆశావర్కర్లకు జీతం నెలకు రూ.3వేలుగా ఉంది. వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు పలుమార్లు ఆశావర్కర్లు జగన్ ను కలిశారు. 

ఆ సమయంలో ఆశావర్కర్ల కనీస వేతనం రూ.10 వేలు చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఇచ్చినమాటకు కట్టుబడి ఆశావర్కర్ల జీతం రూ.10వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచుతూ వైయస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసిస్తున్నారు.