అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై దృష్టిసారించారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సీఎం వైయస్ జగన్ పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. 

సీఎంవోలో కీలక మార్పులు చేసిన జగన్ ఇకపై పాలనపై దృష్టిపెట్టబోతున్నారు. అందులో భాగంగా శనివారం నుంచి సమీక్షలకు శ్రీకారం చుట్టబోతున్నారు వైయస్ జగన్. శనివారం ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలపై వైయస్ జగన్ సమీక్షలు చేయనున్నారు. 

అలాగే జూన్ 3న విద్యాశాఖ, జూన్ 4న సాగునీరు, హౌసింగ్ శాఖలపై సమీక్షలు చేయనున్నారు. జూన్ 5న వ్యవసాయం, జూన్ 6న సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్షలు చేయనున్నారని తెలుస్తోంది. 

వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడం స్కూళ్లు తెరుచుకునే సమయం దగ్గర పడటంతో విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు జగన్. అమ్మఒడి పథకంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. 

అలాగే జూన్ 6న సీఆర్డీఏపై జగన్ సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఆర్డీఏలో ఏయే అంశాలపై జగన్ రివ్యూ నిర్వహిస్తారా అన్న ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో వైయస్ జగన్ సీఆర్డీఏపై కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో దానిపైనే ప్రత్యేకించి రోజంతా రివ్యూలు నిర్వహించడం వెనుక అంతరార్థం ఏమై ఉంటుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇకపోతే శుక్రవారం ఉదయం ఏపీ నూతన డీజీపీ గౌతం సవాంగ్ తో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పలు సూచనలు చేశారు. అలాగే ఇంకా చేపట్టాల్సిన ప్రక్షాళన, అధికారుల బదిలీలపై జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.