Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం తొలగింపు: ఏపీ సీఎం జగన్

ధాన్యం సేకరణలో  ముందస్తు అంచనాలతో  అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  కోరారు. ఇవాళ  తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్  సమీక్ష నిర్వహించారు. 

AP CM YS Jagan Reviews  On Paddy procurement
Author
First Published Dec 5, 2022, 5:18 PM IST

అమరావతి:ధాన్యం సేకరణలో  రైతులకు  ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆదేశించారు. ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు.రైతులకు కనీస మద్దతు ధర కంటే  ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 

ఇందుకు గాను ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు. ధాన్యంసేకరణపై ముందస్తు అంచనాలతో గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం  సూచించారు.రవాణా, లేబర్‌ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలన్నారు.అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలని సీఎం కోరారు.

రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలపాలని సీఎం  సూచించారు. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు.ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్‌ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.

ధాన్యం సేకరణకోసం తయారు చేసిన యాప్‌లో సిగ్నల్స్‌ సమస్యల వల్ల అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదుచేసుకుని  సిగ్నల్‌ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్‌ అయ్యేలా మార్పులు చేసుకోవాలని సీఎం  సూచించారు. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నట్టుగా  సీఎం చెప్పారు. ఆయా శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలన్నారు.

పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్‌ఓపీలను తయారుచేయాలని సీఎం కోరారు.    ఈ ఎస్‌ఓపీలను పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు.    అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్‌ఓపీలు ఉండాలని చెప్పారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుమీదకూడా రైతులకు అవగాహన కలిగించాలన్న సీఎం సూచించారు.ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

ఈ  సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌చైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీ ఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి హెచ్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, పౌరసరఫరాల డైరక్టర్‌ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios