యాస్ తుఫాన్‌తో కరోనా రోగులు ఇబ్బందిపడొద్దు: జగన్

యాస్ తుఫాన్ నేపథ్యంలో కరోనా రోగులకు అందించే వైద్య చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు  లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 

AP CM YS jagan reviews on Corona cases lns

అమరావతి: యాస్ తుఫాన్ నేపథ్యంలో కరోనా రోగులకు అందించే వైద్య చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు  లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనాపై ఏపీ సీఎం జగన్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాస్‌ తుపాను నేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం లేకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. రోజు వారీగా కావాల్సిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు, నిల్వలపైనా దృష్టి పెట్టాలన్నారు. దీనిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 15 వేల ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్స్‌ తెప్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ఇవి సక్రమంగా పని చేసేలా తగిన వ్యవస్థ ఉండాలని సీఎం కోరారు.

బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైట్‌ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోందని, వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.50 బెడ్లు దాటిన ప్రతి ఆస్పత్రికి కచ్చితంగా ఆక్సిజన్‌ సౌకర్యం ఉండాలని ఆయన చెప్పారు. యాభై బెడ్లు దాటిన ఆస్పత్రుల్లో ఆగస్టు చివరి కల్లా ఆక్సిజన్‌ జనరేషన్‌ ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు.అలాగే ఆయా ఆస్పత్రుల్లో కాన్‌సన్‌ట్రేటర్లు కూడా ఉండేలా చూడాలన్నారు. సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు పెట్టుకునే ప్రైవేటు ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తామని ఆయన ప్రకటించారు.ఆగస్టు చివరి కల్లా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాని సూచించారు. 

యాస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడి నుంచి వారిని తరలించాలన్న దానిపై వెంటనే నిర్ణయం తీసుకుని తుపాను ప్రభావం మొదలు కాక ముందే తరలించాలని ఆయన ఆదేశించారు.  తుపాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.కార్పొరేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే ఈ బోధనాసుపత్రుల నిర్వహణ కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రోగులకు ఇచ్చే ఆహారం నుంచి పారిశుద్ధ్యం వరకూ అన్నీ కూడా నాణ్యంగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏ విధంగా ఈ ఆస్పత్రులను నిర్వహిస్తారన్న దానిపై ఓ ప్రణాళికను వివరించాలని ఆయన అధికారులను కోరారు. కోవిడ్‌ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ నొక్కి చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios