ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ ఉండాలని, మురుగనీటి శుద్ధి కేంద్రాలతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు.

తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, చేపట్టాల్సిన కొత్త పనులపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించాలని ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను సక్రమంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

మరోవైపు తాను నివసిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తయారు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు.

రెండు పట్టణాల్లో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని.. ఉగాది నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.