అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు భర్తీకి క్యాలెండర్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అమరావతిలో విద్యాశాఖపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగానే ఉపాధ్యాయల సంఖ్య ఉండాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అన్ని తరగతులకూ ఒక్క గురువే ఉన్నారని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. వాటిపై సమీక్షించాలని జగన్ ఆదేశించారు. 

పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపర్చే విషయంలో అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని, ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

తొలి విడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832  ప్రాథమికోన్నత పాఠశాలల రూపురేఖలు మార్చాలని జగన్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 42,655  పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీశామని, దాదాపుగా 10.88 లక్షల ఫోటోలను కూడా అప్‌లోడ్‌ చేసినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం జగన్ కు వివరించారు. అన్ని పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫోటోలు తీసి ప్రజల ముందు ఉంచాలని జగన్ ఆదేశించారు.