రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి అంశంపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.

కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్రోచ్, స్పిల్‌ ఛానెల్‌ పనులు మే నాటికి పూర్తి చేయాలని, అంతకు ముందే కాఫర్‌ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. అంతేగాకుండా పోలవరం నుంచి విశాఖపట్నం తాగు నీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్‌ లైన్‌ ఏర్పాటు కోసం కూడా ఆలోచన చేయాలని నిర్దేశించారు.

అదే విధంగా, ఎటువంటి పంపింగ్‌ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా విద్యుత్ వినియోగం లేకుండా చేసే అవకాశాలనూ చూడాలన్నారు.

పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్‌ వాటర్‌ (అప్లెక్స్‌ లెవల్‌)తో ఎక్కడా ఏ సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేసి నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్‌ అదేశించారు.