Asianet News TeluguAsianet News Telugu

90 రోజుల్లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి... నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. 

ap cm ys jagan review meeting on health department over covid19 and vaccination
Author
Amaravati, First Published Aug 17, 2021, 4:58 PM IST

అమరావతి: ఇప్పటికే నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేయాలని వైద్య శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పీహెచ్‌సీలు మొదలుకుని సీహెచ్‌సీలు, బోధనాసుపత్రుల వరకు అన్నిట్లోనూ ఖాళీలు లేకుండా రిక్రూట్‌ మెంట్ పూర్తిచేయాలని... 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ నియామకాల తర్వాత ఎక్కడ కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదని స్ఫష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సీఎం అన్నారు. 

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. 

థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం వైద్యశాఖ అధికారులతో చర్చించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు సీఎం జగన్. 

ఇక ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు వుంటాయని తెలిపారు. ఒకవేళ తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లలో 150 మందికి మించి అనుమతి ఇవ్వవద్దన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

read more  మహిళల రక్షణకే ప్రాధాన్యత: ఏపీ హోంమంత్రి సుచరిత

కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌ పై సీఎంకు వివరాలందించారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 17,218వుండగా రికవరీ రేటు 98.45 శాతం వుందని తెలిపారు. పాజిటివిటీ రేటు 1.94 శాతంగా వుంటే రాష్ట్రవ్యాప్తంగా 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు 10 వుండగా 3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు 3 వున్నాయని తెలిపారు.  
 
ఇక రాష్ట్రంలో మొత్తం వాక్సినేషన్‌ తీసుకున్నవారు 1,82,00,284 వుండగా కేవలం సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నవారు 1,15,98,720, రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయిన వారు 66,01,563 వున్నారు. రాష్ట్రంలో ఉపయోగించిన మొత్తం వ్యాక్సిన్‌ డోసులు 2,48,01,847అని వైద్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. 
 
ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్‌ అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేలా చూసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. దీనివల్ల వారి ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయన్నారు. అయితే ఇప్పటికే డ్రగ్‌ డీలర్లు పంపిణీచేస్తున్న మందులకు సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని... దీనివల్ల ట్రాకింగ్‌ సులభం అవుతుందని సీఎంకు తెలిపారు అధికారులు.
 
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios