Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త... వైద్యారోగ్య శాఖలో మరో 2072 పోస్టుల భర్తీ

వైద్యారోగ్య శాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖాళీల భర్తీ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

AP CM YS Jagan Review Meeting on Health and medical  ministry
Author
Amaravati, First Published Jun 28, 2022, 5:11 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఖాళీల భర్తీ... ప్రమాణాలకు అనుగుణంగా వైద్యారోగ్య శాఖలో సిబ్బంది నియామకం చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ఇప్పటికే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుండి ఇప్పటివరకు ఒక్క వైద్యారోగ్య శాఖలోనే 40,188 పోస్టులు భర్తీచేసినట్లు అధికారులు తెలిపారు. మరో 1,132 మంది భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 176 కొత్త పీహెచ్‌సీలకు సంబంధించి ఇంకా డాక్టర్లు అవసరమని... ఈ పీహెచ్‌సీల నిర్మాణం పూర్తికాగానే వారిని నియమిస్తామన్న అధికారులు తెలిపారు. ఇందుకోసం మరో 2072 పోస్టులు   భర్తీ చేయనున్నట్లు  అధికారులు సీఎంకు వివరించారు. 

వైద్యారోగ్య శాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పై సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు–నేడుతో పాటు వైద్యారోగ్య శాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులకు ముఖ్యమంత్రి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదని... ఏ కారణం వల్ల అయినా పోస్టులు ఖాళీ అయితే వెంటనే వాటిని భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. వివిధ రంగాల్లో మనం సంస్కరణలతో ముందుకు సాగుతున్నామని... మంచి ఫలితాలు రావాలంటే అందుకు సరిపడా సిబ్బందిని నియమించుకోవడం తప్పనిసరి అన్నారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుత్రుల వరకూ ఎక్కడా కూడా డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదన్నారు. పదవీ విరమణ చేసిన వైద్యులు, ఆ రంగంలోని రిటైర్డ్‌ సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని... అవసరమైతే వారి పదవీవిరమణ వయస్సును కూడా పెంచే ఆలోచన చేయాలన్నారు. జులై 26 నాటికల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఈ మొత్తం ప్రక్రియ ముగియాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

ఇక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని... ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌ చేసే విధానం బలోపేతంగా ఉండాలని... రిఫరల్‌ విధానాన్ని పర్యవేక్షణ చేయాలని సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌లో రిఫరల్‌ కోసం పర్మినెంట్‌ ప్లేస్‌ను డిజైన్‌ చేయాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ అన్నవి రిఫరల్‌ కేంద్రాలుగా పనిచేస్తాయని... ఎక్కడికి రిఫరల్‌ చేయాలన్నదానిపై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు. 

ఆరోగ్యశ్రీ అందుకున్న తర్వాత లబ్ధిదారులకు లేఖ అందాలని... ఈ పథకం ద్వారా అతడికి అందిన లబ్ధిని అందులో పేర్కొనాలన్నారు. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రి నుంచి పేషెంట్‌ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కన్ఫర్మేషన్‌ తీసుకోవాలన్నారు. పేషెంట్‌ తిరిగి కోలుకున్నంతవరకూ అందిస్తున్న ఆరోగ్య ఆసరా విషయాలు కూడా కన్ఫర్మేషన్‌ పత్రంలో ఉండాలన్నారు. ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలని వైఎస్ జగన్ సూచించారు.

ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరవాలని... వారికి అందించే డబ్బును నేరుగా ఈ ఖాతాకు పంపాలన్నారు. ఈ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆస్పత్రికి డబ్బులు వెళ్లాలన్నారు. ఈమేరకు కన్సెంట్‌ పత్రాన్ని పేషెంట్‌నుంచి తీసుకోవాలని సూచించారు. తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్‌ వినియోగపడుతుందన్నారు. ఈ విధానాల వల్ల పారదర్శకత వస్తుందని సీఎం పేర్కొన్నారు. 

తనకు చేసిన వైద్యం, ప్రభుత్వం నుంచి అందిన సహాయం, అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు అంతా కూడా పారదర్శకంగా ఉంటాయని... దీంతో మరింత జవాబుదారీతనం, పారదర్శకత వస్తుందన్నారు. రోగిపై అదనపు భారాన్ని వేయకుండా, వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

ఆరోగ్య మిత్రలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుందని... దీనికి అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్న సంకేతం వెళ్లాలన్నారు. అదనంగా తన వద్దనుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్‌ పేషెంట్‌ నుంచి తీసుకోవాలని...  ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఏ నెంబరుకు  కాల్‌ చేయాలన్న విషయం కూడా పేషెంట్‌కు తెలియాలన్నారు. 

ఆరోగ్య మిత్రలు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడాలని సీఎం ఆదేశించారు. పేషెంట్‌ అస్పత్రిలో చేరిన దగ్గరనుంచీ డిశ్చార్జి అయ్యేంత వరకూ వారికి అండగా, తోడుగా నిలవాలన్నారు. పేషెంట్‌ ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్య కార్యకర్త ఆ ఇంటికి వెళ్లి బాగోగులు చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందిన సేవలు, ఆరోగ్య మిత్రలనుంచి అందిన సహాయం తదితర సేవలపై వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. 

ఇక 108, 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో లంచాలకు ఆస్కారం ఉండకూడదని... అసలు లంచం అడిగే పరిస్థితులు లేకుండా ఎస్‌ఓపీలు ఉండాలన్నారు. లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న నంబర్లను అవే వాహనాలపై ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. 

 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios