అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. గడిచిన 24గంటల్లోనే రాష్ట్రంలో మరో 67 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కు చేరాయి. మళ్లీ కర్నూల్ జిల్లాలోనే అత్యధికంగా 25 ఈ వైరస్ బారిన పడినట్లు తేలగా గుంటూరులో 19, కృష్ణాలో 12, విశాఖలో 6, కడపలో 4, చిత్తూరులో ఒకరికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. 

గడిచిన 24గంటల్లో 10,292 మందికి కరోనా పరీక్షలు చేయగా 67 పాజిటివ్ కేసులు బయటపడ్డట్లు ఏపి వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650 కి చేరుకోగా ఇందులోంచి ఇప్పటికే 524 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1093 గా వుంది. ఇప్పటివరకు 33మంది ఈ వైరస్ కారణంగా  మరణించారు. 

 

కేంద్రప్రభుత్వం మొదటిసారి లాక్ డౌన్ సడలింపు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఏపిలోని జగన్ ప్రభుత్వం దాన్ని అమలుచేసింది. కేంద్ర ఆదేశాలను పాటిస్తూ కొన్నింటికి లాక్ డౌన్ నుండి మినహాయించింది. అంతేకాకుండా కరోనా నిర్దారణ పరీక్షల సామర్ధ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు కూడా వేగంగా పెరిగాయి.

ఇక తాజాగా మరోసారి లాక్ డౌన్ ను మరింత సడలించుకోడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి ఈ సడలింపులకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోను ఆంధ్ర ప్రదేశ్ వైన్ షాప్ లు ఓపెన్ అయ్యాయి. అంతేకాకుండా మరికొన్ని రకాల వెసులుబాట్లు కూడా ఏపి  ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కల్పించింది. 

అయితే ఓవైపు లాక్ డౌన్ ను జగన్ ప్రభుత్వం సడలిస్తూ వెలుతుంటే మరోవైపు కరోనా కేసుల సంఖ్యల పెరుగుతూ వెళుతోంది. ఇక తాజాగా మద్యం అమ్మకాలను ప్రారంభించడంతో మందుబాబులు సోషల్ డిస్టెన్సింగ్ వంటి నిబంధనలను పాటించకుండా వైన్  షాప్ ల వద్ద  బారులుతీరారు.  దీనివల్ల ఈ మహమ్మారి మరింత వేగంగా విజృంభించే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలే కాదు సామాన్య ప్రజానికం కూడా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.