కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై చర్చించారు.

అలాగే వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రికి వారు వివరించారు. విదేశాల నుంచి వచ్చే వారిని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో అక్కడే మెడికల్ స్క్రీనింగ్ చేయిస్తామని సీఎం దృష్టికి వెల్లడించారు.

మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అలాగే విదేశాల నుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామని వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read:కేంద్రం చెప్పిందా: జగన్ కు జీవీఎల్ చురకలు, చంద్రబాబు పుణ్యమేనని...

మహారాష్ట్రలోని థానే నుంచి 1,000 మందికి పైగా వలస కూలీలు గుంతకల్ వచ్చారని.. వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. థానేలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందని.. దీని కారణంగా వీరిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని.. వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి వారికి ప్రయాణ ఏర్పాటు చేయాలన్నారు.

ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లేటప్పుడు  దారి ఖర్చుల కింద ఒక్కో కూలీకి రూ.500 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

Also Read:రేట్లు పెంచితే సంపూర్ణ మద్యపాన నిషేధం జరగదు: జగన్‌పై ఆలపాటి ఫైర్

ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర కూలీలు ఏపీకి వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకు రాని పరిస్ధితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దన్నారు. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో డిశార్జ్ కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రోటోకాల్ పాటిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి వెల్లడించారు. వరుసగా రెండు పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ 19 కేసుల డిశ్చార్జిలో దేశ సగటు 28.63 శాతం అయితే, రాష్ట్రంలో 41.02 శాతం, పాజిటివిటి రేటు రాష్ట్రంలో 1.26 శాతం అయితే దేశంలో 3.87 శాతం ఉందని అధికారులు తెలిపారు.