Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో తిరిగి అభివృద్ధి పనులు షురూ...: జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అమరావతి ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 

AP CM YS Jagan Review Meeting on Amaravathi Development
Author
Amaravathi, First Published Feb 8, 2021, 4:17 PM IST

అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనపై వివరాలు సీఎంకు  అందించారు అధికారులు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీంతో రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందన్నారు. 

ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లనుకూడా అభివృద్ధిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులుకూడా పూర్తిచేయాలన్న సీఎం ఆదేశించారు. హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అమరావతి ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 

read more   టీడీపీ ఎంపీ కనకమేడలపై చర్యలకు డిమాండ్: వెంకయ్యకు విజయసాయి లేఖ

విశాఖపట్నం పరిధిలోని ప్రాజెక్టులపై కూడా సీఎం సమీక్షించారు. సముద్రతీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీఎం అధికారులతో చర్చించారు. ఇదే భూమిని లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ళ లీజ్‌కు కట్టబెట్టినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. 

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ కూడా సీఎంకు వివరాలు అందించాయి. కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి సుమారు రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందన్న ఎన్‌బీసీసీ సీఎంకు తెలిపింది. 

ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఏఎంఆర్‌డీఏ కమీషనర్‌ పి. లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios