రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోమవారం నాడు లేఖ రాశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. 

అమరావతి: రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోమవారం నాడు లేఖ రాశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కనకమేడల రవీంద్రకుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు.

రాజ్యసభ నియమ నిబంధనలకు విరుద్దంగా కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని ఆ లేఖలో ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి కనకమేడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హానికరమైనవిగా ఆయన పేర్కొన్నారు. సభలో చర్చ జరిగే అంశం నుంచి పక్కకు మళ్ళుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసన వ్యవస్థల కార్యకలాపాలపైన, వ్యక్తులపైన కనకమేడల చేసిన అసహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రూల్‌ 238 (3), రూల్‌ 238 (5) ఉల్లంఘన అవుతుందని విజయసాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఇటీవల టీడీపీకి చెందిన ఎంపీలు.. కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో మత సంఘర్షణలు జరుగుతున్నాయని ఇందుకు సాక్ష్యంగా 2016-17 మధ్య నాటి ఒక వీడియో క్లిప్‌ను ఆయనకు చూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తికి చెందిన ఆయన వీడియో క్లిప్‌ వాస్తవానికి 2016-17 మధ్య నాటిది. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న వాస్తవాన్ని టీడీపీ ఎంపీలు.. హోం మంత్రి వద్ద దాచిపెట్టారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ ను కూడ ఆయన ఈ లేఖకు జత చేశారు.