నా ప్రతి అడుగు పేద విద్యార్థుల కోసమే: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు విడుదల చేశారు. ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు.
అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద రెండో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో ఆయన మాట్లాడారు.ప్రతి పేద విద్యార్ధికి చదువు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ స్కీమ్ ముందుకు తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు భారం కాకుండా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఆయన పేర్కొన్నారు.
also read:జగనన్న విద్యా దీవెన: నేడు రెండో విడత నిధుల విడుదల
పదో తరగతి తర్వాత డ్రాపవుట్స్ పెరగడం ఆందోళనకరమని ఆయన చెప్పారు. ప్రతి అడగులోనూ విద్యార్థుల భవిష్యత్తు కోసమే శ్రమిస్తున్నామని ఆయన చెప్పారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వంద శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్ ను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో విద్యార్థుల కోసం ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోందన్నారు. విద్యాదీవెనలో భాగంగా ఇప్పటివరకు రూ. 5,573 కోట్లను ఖర్చు చేసినట్టుగా సీఎం గుర్తు చేశారు.విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 26677 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా నాలుగు దపాలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 19న తొలి విడత కింద రూ. 671 కోట్లు జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పిల్లలకు మనం అందించే ఆస్తి విద్య అని ఆయన నొక్కి చెప్పారు. 2011 జనాభఆ లెక్కల ప్రకారంగా దేశంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంటర్ దర్వాత డ్రాపవుట్స్ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు.